Wednesday, 3 April 2013

Ugadi


 ఉగాది నుండే తెలుగు సంవత్సరము మొదలవుతుంది . ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం పరిపాటి . ఇది ఇంగ్లీష్ డేట్స్ ప్రకారము రాదు . చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపు కొంటాము .

సంవత్సర కాలగణనలో ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ వారి వారి పద్ధతుల్ని ఏర్పరచుకున్నాయి. భారతదేశంలో ప్రధానంగా ఒకే సనాతన సంస్కృతి ఉన్నప్పటికీ, ఆచారవ్యవహారాల్లో సంప్రదాయాల్లో కొద్దిపాటి భేదాలు కనిపిస్తుంటాయి. ఉత్తర దక్షిణ భారతదేశంలో కొన్ని వైవిధ్యాలున్నా- ప్రధాన జ్యోతిశ్శాస్త్రం, గణనసూత్రం ఒక్కటే.

ఉత్తరాదిలో బార్హస్పత్యమానం, దక్షిణాదిన సౌర, చాంద్రమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. తెలుగు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చాంద్రమానాన్ని అవలంబిస్తారు.

చంద్రమానం ప్రకారం చైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తయ్యే సంవత్సరానికి ఈరోజు (చైత్రశుద్ధ పాడ్యమి) ఆది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. 'ఉగం' అంటే 'నక్షత్ర గమనం' అనే అర్థం ప్రకారం ఏడాదిని 'ఉగం'గానూ, దాని తొలిదినాన్ని 'ఉగాది'గానూ వ్యవహరిస్తారు. అదేవిధంగా రెండు అయనాలు ఉన్న సంవత్సరాన్ని 'యుగం' అంటే, మొదటిరోజున 'యుగాది' అనవచ్చు. దాన్ని 'కల్వాది'గా కూడా కొన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ తిథినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని వాటి కంఠోక్తి. వసంత రుతువులో 'తొలి'తనం, శిశిరంలో 'చివరి' లక్షణం ప్రకృతిలో ప్రత్యక్షమయ్యే గమనం. ఈ రెంటి నడుమ ఏడాదికాలాన్ని పరిగణించడం చక్కని ప్రాకృతిక సమన్వయం. అరవై సంవత్సరాల పేర్లు సూర్య విజ్ఞానాన్ని సూచిస్తున్నవే.

ఉగాది కథ తెలుసుకుందామా?

ఆంగ్లంలో నెలల పేర్లు చెప్పమంటే జనవరి నుంచి డిసెంబర్‌ వరకు చెబుతారు. అలాగే తెలుగు నెలలు వేరే ఉన్నాయని తెలుసుగా? వాటిని చైత్రం నుంచి ఫాల్గుణం వరకు చెప్పాలి. కాలాన్ని కొలవడంలో వేర్వేరు పద్ధతులను ఉపయోగించడం వల్లనే ఈ తేడాలు ఉంటాయి. సూర్యుని గమనం ఆధారంగా సౌరమానం, చంద్రుడి గమనం ఆధారంగా చాంద్రమానం వాడుకలో ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం తెలుగు నెలల్లో చివరిదైన ఫాల్గుణ మాసం పూర్తయ్యాక తిరిగి చైత్రమాసం మొదలవుతుంది. ఆ తొలిరోజునే 'ఉగాది'గా పరిగణిస్తారు. అంటే ఆంగ్ల క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాది జనవరి 1తో మొదలైతే, మన తెలుగు క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ఆరంభమవుతుందన్నమాట.

పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. యుగానికి ఆది యుగాది అయితే, వాడుకలో అదే ఉగాదిగా మారిందని చెపుతారు. ఈ రోజుతోనే వసంత రుతువు మొదలవుతుంది.

ఉగాది పుట్టుక వెనుక మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. సృష్టిబాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కోరాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టున్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇస్తాడు. ఇదే మొదటి దేవుని విగ్రహమని అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేసిన బ్రహ్మ, ఆతర్వాత దాన్ని సూర్యుని కోరిక మేరకు అతనికి ఇచ్చాడు. సూర్యుడు తన కొడుకైన మనువుకు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఇచ్చారు. అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడి కోరికపై రాముడు దాన్ని ఇచ్చాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దాన్ని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహమే శ్రీరంగనాథస్వామి అని చెబుతారు. ఆ సంఘటన కూడా ఉగాదినాడే సంభవించిందంటారు.

* ఉగాదిని మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్‌, సింధీ ప్రజలు చేసుకుంటారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా అని, మణిపూర్‌లో సాజిబు చేరోబా అని, సింధీ ప్రజలు చేత చాంద్‌ అని పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది పచ్చడిని బేవు-బెల్లా అంటారు.
* ఉగాది రోజు అమ్మ ఆరు రుచులతో కూడిన పచ్చడి చేస్తుంది కదా? దానర్థం ఏమటంటే జీవితంలో సుఖ, సంతోషాలు, కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలనేదే! ఆరు రుచుల్లో తీపి సంతోషానికి, చేదు బాధకి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకు, వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు.

No comments:

Post a Comment